Monday, March 24, 2014

సినిమా చరిత్రకు విలువైన కానుక

  • -డా.పైడిపాల
సినిమాగా సినిమా
(తెలుగు చలనచిత్ర చారిత్రిక గ్రంథం)
రచన: నందగోపాల్
పుటలు: 423, వెల: రూ.750
ప్రచురణ:
ప్రగతి ఆఫ్‌సెట్ (ప్రై.) లిమిటెడ్
ప్రతులకు:
అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు
చలనచిత్ర నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక విజ్ఞాన వికాసంతో ప్రారంభించి నేటివరకు తెలుగు సినిమా పరిణామాన్ని విస్తృతంగా అధ్యయనం చేసి నిర్దుష్టమైన భాషా పరిజ్ఞానంతో సీనియర్ పాత్రికేయులు నందగోపాల్ భారతీయ చలనచిత్ర శతాబ్ది ఉత్సవ సందర్భంగా సినీ ప్రియులకందించిన విలువైన కానుక ‘సినిమాగా సినిమా’.
రచయిత చాలాకాలం సెన్సార్ బోర్డ్ సభ్యులు, యన్.డి.సి. స్క్రిప్ట్ సెలక్షన్ కమిటీ సభ్యులు, తెలుగు తెర, కినిమా పత్రికల సంపాదకులు, ఎన్.టి.ఆర్, ఎ.ఎన్.ఆర్. వంటి మహానటులకు సన్నిహితులు, ప్రతిష్ఠాత్మక భారతీయ సినిమా శతాబ్ది అవార్డ్ అందుకొన్న పెద్దలు. తెలుగు చిత్ర పరిశ్రమతో తనకున్న చిరకాల పరిచయంతో తెలుగు సినిమా చరిత్రకు సంబంధించిన అపూర్వమైన గ్రంథాన్ని రాయాలనే సంకల్పంతో అయిదు సంవత్సరాలు కృషిచేసి, ఈ పుస్తకాన్ని వెలువరించినట్టు ముందు మాటలవల్ల తెలుస్తోంది.
ముందు మాటల్ని, అనుబంధాల్ని మినహాయిస్తే ఈ పుస్తకంలో 37 అధ్యాయాలున్నాయి. బొమ్మ కదిలింది, బొమ్మ మాట్లాడింది అనే మొదటి రెండు అధ్యాయాల్లో- స్టిల్ ఫొటోగ్రఫీ, కినిటోస్కోప్ ప్రదర్శనలు, మూకీల ముచ్చట్లు, టాకీల సంబరాలు మొదలైన ఆసక్తికరమైన అంశాలను చర్చించగా, ప్రపంచ సినిమా, చిత్రభారతి అనే తర్వాతి విభాగాలలో ప్రపంచవ్యాప్తంగానూ, వివిధ భారతీయ భాషలలోనూ వచ్చిన సినిమాల తీరుతెన్నులను సమీక్షించారు. తెలుగుసినిమా అనే 5వ విభాగం నుంచి ‘చిన్ని చిన్ని ఆశ’ అనే చివరి అధ్యాయం వరకు తెలుగు సినీ రంగానికి చెందిన నిర్మాణం, దర్శకత్వం, నటన, మాటలు, పాటలు, సంగీతం, నాట్యం, కళ, ఛాయాగ్రహణం మొదలైన 24 శాఖలలో కొన్నిటితోపాటు విమర్శ, మీడియా, ప్రేక్షకులు పురస్కారాలు, నాలుగు తెరలు మొదలైన యితర విషయాల గురించి కూడా తనకు తెలిసిన సమాచారంతోపాటు తన అభిప్రాయాలను జోడిస్తూ- ఈ గ్రంథ రచన సాగించారు నందగోపాల్. అనుబంధంలో కమలాకర కామేశ్వరరావు అలనాటి ద్రౌపదీ వస్త్రాపహరణం, ద్రౌపదీ మానసంరక్షణం చిత్రాలను సమీక్షిస్తూ రాసిన - ‘రెండు సినిమాలు- ఒక సమీక్ష’ వ్యాసాన్ని, ‘ఎదురులేని మనిషి’ శత దినోత్సవ వేడుకలు సందర్భంగా ఎన్.టి.రామారావు చేసిన ‘నిర్మాత నిలబడాలి- పరిశ్రమ బలపడాలి’ ప్రసంగానికి వ్యాస రూపాన్ని, ‘ఒకే ఒక సావిత్రి’ అంటూ మహానటి సావిత్రిపై తన స్వీయ వ్యాసాన్ని, చివరి మాటగా తన పురస్కారాల సమాచారాన్ని అందించారు. వెరసి రచయితే చెప్పుకొన్నట్టు- ఇవాళ సినిమా సినిమా కాకుండా పోతుందనే ఆర్తి, సినిమా సినిమాగా నిలబడాలనే ఆశ, ఆకాంక్ష రచయిత చేత ఈ పుస్తకాన్ని రాయించాయి. రచయిత ఉదాత్తమైన ఆశయం, ఆయన ప్రపంచ, భారతీయ సినిమాల గురించి యిచ్చిన అమూల్యమైన సమాచారం అభినందనీయాలు. అయితే దీనికి ముందుమాటగా ‘ఏకైక..’అంటూ తుల లేని అధ్యయనంగా రూపుదిద్దుకొన్న తొలి తెలుగు గ్రంథంగానూ, ‘ఒనరన్ నన్నయ తిక్కనాది..’ అంటూ పోతన పద్యాన్ని ఉటంకించి యింతకుముందు ఎవరూ చేయని ప్రయత్నంగానూ ఈ రచనను డా.జయదేవ్ అభివర్ణించడం మాత్రం సబబుకాదు. దీనికి ముందు సినిమా చరిత్రకు సంబంధించిన ఎన్ని పుస్తకాలు వెలువడలేదు?!
‘సినిమాగా సినిమా’అనే మకుటాన్ని ముఖ పత్రంపై రాసేటప్పుడు ‘సినిమాగా సినిమా’గా విడదీయడంవల్ల అర్థస్ఫూర్తి కొరవడుతుంది. అలాగే విషయ సూచిక కింద గమనికలో- 423వ పుటలో ‘రజతోత్సవ’కు బదులుగా ‘వజ్రోత్సవ’ వుండాలి అని రాశారు. నిజానికి అది 75 సంవత్సరాల ఉత్సవం. ఇంగ్లీషులో ప్లాటినమ్ జుబ్లీ అని, తెలుగులో మూడు పాతికల పండుగ అని పేర్కొనాలి! ముఖ్యంగా రచయితకు ఆప్తులైన అక్కినేని నాగేశ్వరరావును, ఘంటసాల బలరామయ్య ‘శ్రీ సీతారామ జననం’తో తెరకు పరిచయంచేశారు అని రాయడం ఆశ్చర్యం! అక్కినేని ‘్ధర్మపత్ని’తోనే వెండితెరకు పరిచయమయ్యారు. శ్రీ సీతారామ జననంతో హీరోగా పరిచయమయ్యారు!
స్వీకరించిన వస్తుపరిధి విస్తృతంకావడం వల్లనో, రచయిత దృక్కోణం వల్లనో కొన్ని శీర్షికలకు కనీస న్యాయం జరగలేదు. నిర్మాతల చరిత్ర రూపొందడానికి కారకులైన దాసరి, మురారిగార్ల ప్రసక్తిలేని ‘నిర్మాత’, రాఘవేంద్రరావు, డా.దాసరి నారాయణరావు, బాపుత్రయానికి కూడా చోటులేని ‘డైరక్టర్’ ఆత్రేయ అంతటివాణ్ణి తలవని ‘మాటలు’, సిరివెనె్నల సీతారామశాస్ర్తీ పేరే లేని ‘పాటలు’, యస్.పి.బాలసుబ్రహ్మణ్యాన్ని పట్టించుకోని ‘సినిమా- సంగీతం’ ఇత్యాదులు ఇందుకు వుదాహరణలు.
1. పరితాప భారంబు భరియింప శక్యమా (తరమా)- పుట 119, 2. వేణువై వచ్చాను భువనానికి, గాలినై వెళ్లాను (పోతాను) గగనానికి- పుట 208, 3. కొల్లాయి కట్టితేనేమి, మా గాంధి కోమటై తిరిగితేనేమి (పుట్టితేనేమి)- 244, 4. ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు (జన్మ)- పుట 249 మొదలైన ఉట్టంకనాలలో పొరపాట్లు దొర్లాయి. మొదటి సినిమా పాటగా ‘పరితాప భారంబు..’ను పేర్కొనడం సరికాదు. ‘వింతాయెన్ వినన్ సంతస మాయెనుగా’ మొదటి పాట. ‘్భక్తప్రహ్లాద’ విడుదల కూడా 1932 అని నిరూపింపబడినా, ఇంకా సెప్టెంబరు 1931 అని రాయడం తాజా పరిశోధనల్ని పరిగణించక పోవడమే! చివరిలో పుస్తక రచనకుపకరించిన గ్రంథాల జాబితాను యివ్వాలి కదా! ఏతావతా రచనా ప్రణాళిక పక్కాగా లేదు. ‘ప్రగతి’వారి అందమైన అచ్చులో ముద్రారాక్షసాలు, అందునా- నవయుగకవి చక్రవర్తి గుర్రం జాషువా(పుట 210) వంటివి దొర్లడం ఆశ్చర్యకరం!
ఇది మలి ముద్రలో సవరించుకోడానికి చేసిన కొన్ని సూచనలే తప్ప- రంధ్రానే్వషణ దృష్టితో రాసినవి కావు. నిజాయితీతో నిబద్ధతతో సినిమాల్లో దిగజారుతున్న విలువల పట్ల ఆవేదనతో, సినిమా సినిమాగా బతికే వేకువ రావాలనే తపనతో ఈ వయసులో పెద్దాయనచేసిన ప్రయత్నం మాత్రం ప్రశంసనీయం. ఆయన కష్టపడి సేకరించిన సమాచారం భావి పరిశోధకులకు తప్పక ఉపయోగపడుతుంది. ధర అందుబాటులో లేని మాట వాస్తవమైనా సినీ పుస్తక ప్రియులు కొనదగిన, దాచుకొనదగిన పుస్తకం యిది.

No comments:

Post a Comment